తప్పు జరిగింది.. క్షమాపణలు చెప్పిన మెటా
మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై మెటా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందని కంపెనీ పేర్కొంది.
By Medi Samrat Published on 15 Jan 2025 3:40 PM ISTమార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై మెటా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందని కంపెనీ పేర్కొంది. మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు.
జో రోగన్ పోడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. 2024 ప్రపంచానికి ఎన్నికలతో నిండిన సంవత్సరం.. కోవిడ్ -19 తర్వాత భారతదేశం సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో అధికార మార్పు జరిగిందని, ఇది ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడాన్ని చూపుతుందని అన్నారు. దీనిపై భారత్ వైపు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
దీనిపై సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మేటాను మందలించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 2024లో జరిగిన ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై భారత ప్రజలు మళ్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. కోవిడ్ తర్వాత 2024లో జరిగిన ఎన్నికలలో భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాల ప్రస్తుత ప్రభుత్వాలు ఓడిపోయాయని మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వాదన వాస్తవంగా తప్పు. మెటా, మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా తప్పుడు సమాచారాన్ని అందించడం చూసి నిరాశ చెందాం. వాస్తవాలు అందించడం ద్వారా విశ్వసనీయతను కాపాడుకోండని వ్యాఖ్యానించారు.
అశ్విని వైష్ణవ్ పోస్ట్‌కు సమాధానమిస్తూ మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శివానంద్ తుక్రాల్ క్షమాపణలు చెప్పారు. 2024లో జరిగిన ఎన్నికలలో ఇప్పటికే ఉన్న అనేక పార్టీలు ఎన్నుకోబడలేదని మార్క్ జుకర్ బర్గ్ పరిశీలన ఇతర దేశాలకు వర్తిస్తుంది.. కానీ భారతదేశానికి కాదు.. అనుకోకుండా చేసిన ఈ తప్పుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. METAకి భారత్ ఎల్లప్పుడూ ముఖ్యమైన దేశం. భారత్ మా వినూత్న భవిష్యత్తుకు గుండెకాయగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము అని పేర్కొన్నారు.
గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారత అధికార పార్టీ ఓడిపోయిందని మెటా చీఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ప్యానెల్ మెటాకు సమన్లు జారీ చేస్తుందని భారతీయ జనతా పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధిపతి నిషికాంత్ దూబే మంగళవారం చెప్పారు. ప్రజాస్వామ్య దేశానికి వ్యతిరేకంగా వచ్చిన తప్పుడు సమాచారం ఆదేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. తప్పు చేసినందుకు మెటా సంస్థ భారత పార్లమెంటుకు, ప్రజలకు క్షమాపణ చెప్పవలసి ఉంటుందన్నారు.
జో రోగన్ పోడ్‌కాస్ట్‌లో జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. '2024 ప్రపంచానికి ఎన్నికలతో నిండిన సంవత్సరం.. భారతదేశంతో సహా అనేక దేశాల ఎన్నికలలో పాలక పార్టీలు ఓడిపోయాయి. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూపొందించిన ఆర్థిక విధానాల వల్ల ద్రవ్యోల్బణం కావచ్చు లేదా కోవిడ్‌పై ప్రభుత్వాలు స్పందించిన విధానం వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇది అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తం. ప్రభుత్వాలపై ప్రజలకు పెద్దగా విశ్వాసం లేకపోవడం, అది కనీసం అధికారంలో ఉన్నవారి రూపంలో లేదా ఈ ప్రజాస్వామ్య సంస్థలన్నింటిలో తెరపైకి వచ్చింది.