చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 12 వాహనాలకు నిప్పుపెట్టారు. బాంబ్రాగడ్ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద దోదరాజ్ నుంచి కవండే వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అయితే.. ఆయుధాలతో వచ్చిన మావోయిస్టులు రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది 9 ట్రాకర్లు, రెండు జేసీబీలు, ఓ బుల్ డోజర్‌ను తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. రహదారి నిర్మాణం పూర్తి అయితే.. తమ ఉనికికి ప్రమాదం అని బావించి మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు బావిస్తున్నారు. 100 మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొని ఉంటారని అంటున్నారు. కాగా.. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.