హత్యాకాండ ఆపాలి, శాంతి చర్చలకు సిద్ధం..మావోయిస్టుల సంచలన లేఖ
ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
By Knakam Karthik
హత్యాకాండ ఆపాలి, శాంతి చర్చలకు సిద్ధం..మావోయిస్టుల సంచలన లేఖ
ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తాం..అని లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని మావోయిస్టులు కోరారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగుతోన్న హత్యాకాండను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే, కాల్పుల విరమణను ప్రకటిస్తామని వారు లేఖలో పేర్కొన్నారు.
మేం చేస్తోన్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలన్న శాంతి చర్చల కమిటీకి దేశంలో ఉన్న ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ, దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాలు, జిల్లాలు, తాలూకాలు, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్‌ను చేపట్టాలని కోరుతున్నాం..అని లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత కొద్దిరోజులుగా కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. కూంబింగ్ పేరుతో మొత్తం ఐదు రాష్ట్రాల్లోని అభయారణ్యాల్లో జల్లెడపడుతూ వారిపై విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరగ్గా.. వందల మంది మావోయిస్టులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు తాము సిద్ధమంటూ శాంతి చర్చలపై మావోయిస్టులు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు.