33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.

By Knakam Karthik  Published on  1 March 2025 8:54 AM IST
National News, Uttarakhand, Badrinath, Snowfall-Incident, Workers Rescued

33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో మొదట 57 మంది బీఆర్‌ఓ సిబ్బంది చిక్కుకుపోయారని వార్తలు వచ్చాయి. కానీ 55 మంది అని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇప్పటి వరకు 33 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మిగిలిన వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బద్రీనాథ్‌ సమీపంలోని జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను సరిహద్దు రహదారుల సంస్థ-బీఆర్‌ఓ సిబ్బంది తొలగిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్​, బీఆర్‌వో బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

అయితే, భారత్‌- టిబెట్‌ సరిహద్దు మార్గంలో సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు.. బీఆర్‌వోకు చెందిన కార్మికులు కొద్ది రోజులుగా అక్కడ పని చేస్తున్నారు. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బస చేసిన శిబిరంపై మంచు చరియలు విరిగి పడడంతో మంచు కింద ఉండిపోయారు. ఆ శిబిరంలో మూడు కంటెయినర్లు, ఓ షెడ్‌ ఉన్నాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. నిరంతరాయంగా మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ, ఉత్తర్‌కాశీ, రుద్రప్రయాగ్‌ జిల్లాల్లో 2,400 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే అవకాశముందని చండీగఢ్‌లోని డిఫెన్స్‌ జియో ఇన్ఫర్మేటిక్స్‌ రీసెర్చ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌(డీజీఆర్‌ఈ) గురువారం సాయంత్రమే హెచ్చరికలు జారీ చేసింది

Next Story