రూ.35 కోసం రైల్వేతో ఐదేళ్ల పోరాటం.. 2.98ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి

Man's 5 year fight to get ₹ 35 refund from Railways.కొంత మంది 35 రూపాయ‌లే క‌దా అని వ‌దిలివేస్తుంటారు. ఎన్నో పోతుంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 May 2022 4:23 AM GMT
రూ.35 కోసం రైల్వేతో ఐదేళ్ల పోరాటం.. 2.98ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి

కొంత మంది 35 రూపాయ‌లే క‌దా అని వ‌దిలివేస్తుంటారు. ఎన్నో పోతుంటాయి. ఏం కాదులే అనుకుంటుంటారు. అయితే.. ఎవ‌రో చెప్పిన‌ట్లు డ‌బ్బులు ఎవ‌రికి ఊరికే రావు అని రాజ‌స్థాన్ కు చెందిన సుజీత్ స్వామి బావించిన‌ట్లు ఉన్నాడు. దాదాపు ఐదేళ్ల పాటు రైల్వేతో పోరాడి రూ.35 సాధించుకున్నాడు. అంతేనా అత‌డి వ‌ల్ల దాదాపు 3ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూరడం గ‌మ‌నార్హం.

వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌స్థాన్‌లోని కోటా ప్రాంతానికి చెందిన సుజీత్ స్వామి 2017 జులై 2న ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో ఐఆర్‌సీటీసీ ద్వారా టిక్‌ట్ బుక్ చేసుకున్నాడు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌న ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకున్నాడు. టికెట్ ధ‌ర రూ.765 కాగా.. ర‌ద్దు(క్యాన్సిలేష‌న్‌) చేసుకునందుకు రూ.100 మిన‌హాయించుకుని మిగ‌తా మొతాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది.

వాస్త‌వానికి క్యాన్సిలేష‌న్ చేసుకున్నందుకు రూ.65 మాత్ర‌మే తీసుకోవాల్సి ఉండ‌గా.. అద‌నంగా రూ.35 వ‌సూలు చేసింది. ఎందుక‌ని అడుగ‌గా.. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. అయితే.. తాను జీఎస్టీ అమ‌ల్లోకి రాక‌ముందే టికెట్ ను ర‌ద్దు చేసుకున్నాన‌ని సర్వీస్‌ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టాడు.

దిగొచ్చిన రైల్వే శాఖ రూ.35 వెన‌క్కి ఇచ్చేందుకు అంగీక‌రించింది. అయితే.. ఆయ‌న ఖాతాలో 1మే 2019న రూ.33 మాత్ర‌మే జ‌మ చేసింది. దీంతో మిగిలిన రూ.2కోసం స్వామి మ‌రో మూడేళ్లు పోరాడాడు. ఎట్ట‌కేలకు రైల్వే శాఖ అత‌డికి ఇవ్వాల్సిన రూ.2 కూడా తిరిగి ఇచ్చింది. స్వామి పోరాటంతో మ‌రో 2.98ల‌క్ష‌ల మంది కూడా ల‌బ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్‌ బుక్ చేసుకుని, రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. మొత్తంగా రూ. 2.43 కోట్లను తిరిగి చెల్లించేందుకు అంగీక‌రించింది.

Next Story