ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. అలాగే సిసోడియాను మరికొంతకాలం కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అధికారుల విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. ఆయనను మరో రెండు రోజులు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు పాల్పడ్డారని సిసోడియాతో పాటూ మరికొందరు నేతలు అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్నారు. ఆ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేసి సీబీఐ విచారణకు ఆదేశించారు. గత ఆదివారం ఉదయం నుంచి ఆయనను విచారించిన సీబీఐ సాయంత్రం అరెస్టు చేసింది. ఈ అరెస్టు జరిగిన తరువాత సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే గతంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న మరో మంత్రి సత్యేందర్ జైన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు.