మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ మరియు అతని మంత్రివర్గంలోని నలుగురు సభ్యులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు. గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనల కారణంగా మణిపూర్ అల్లకల్లోలంగా మారింది. సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రాష్ట్రంలోని తీవ్రవాద సంస్థలతో కొనసాగుతున్న సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (ఎస్‌ఓఓ) అంశంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మీటీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా ఇవ్వకూడదంటూ చోటు చేసుకున్న నిరసనలు హింసాత్మకంగా మారిపోయాయి. ఏప్రిల్ 28న చురాచంద్ పూర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఓపెన్ జిమ్ ను ప్రారంభించడానికి రావాల్సి ఉండగా.. ఒక్కరోజు ముందు ఏప్రిల్ 27న ఆ జిమ్ ఉన్న ప్రాంతాన్ని కొందరు దుండగులు తగులబెట్టారు. దీంతో 5 రోజుల పాటూ అక్కడ 144 సెక్షన్ ను అమలు చేశారు. జనం గూమిగూడవద్దని, బహిరంగంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మిగిలిన జిల్లాల్లోనూ 144 సెక్షన్ అమలు చేశారు. ఊహించని విధంగా హింస రాష్ట్రం మొత్తం పాకిపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది.