ఎలక్షన్ కింగ్‌గా పేరొందిన తమిళనాడులోని సేలంకు చెందిన 65 ఏళ్ల టైర్ల రిపేర్ షాపు యజమాని కె పద్మరాజన్ ధర్మపురి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా మరోసారి పోటీ చేస్తున్నారు. పద్మరాజన్‌కు ఎన్నికల్లో పోటీ చేయడంలో అసాధారణమైన ట్రాక్ రికార్డ్ ఉంది. పంచాయతీ ఎన్నికల నుండి అధ్యక్ష ఎన్నికలతో సహా 238 ఎన్నికలలో పాల్గొన్నాడు. అయితే ఎప్పుడూ గెలవలేదు. అన్నిసార్లు ఓటములు ఎదుర్కొన్నప్పటికీ, పద్మరాజన్ కూల్ గానే ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. అతని పట్టుదల కారణంగా చరిత్రలో అత్యంత విఫల అభ్యర్థిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇప్పటి వరకూ అటల్ బిహారీ వాజ్‌పేయి, పివి నరసింహారావు, జె జయలలిత, ఎం కరుణానిధి, ఎకె ఆంటోని, వాయలార్ రవి, బిఎస్ యెడియూరప్ప, ఎస్ బంగారప్ప, ఎస్ఎం కృష్ణ, విజయ్ మాల్యా, సదానంద గౌడ, అన్బుమణి రామదాస్‌లపై పోటీ చేశానని ఆయన తెలిపారు. మొత్తం ఆరుసార్లు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇప్పటి వరకూ దాదాపు రూ. 1 కోటి ఖర్చు చేసిన పద్మరాజన్.. తన ప్రచారానికి తన టైర్ రిపేర్ షాప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నానని తెలిపారు. ఓటమి భారాన్ని మోయడం అందరి వల్లా అయ్యే పని కాదని పద్మరాజన్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది.