టాయిలెట్ గోడపై మహిళ మొబైల్ నంబర్ రాసిన వ్య‌క్తి.. గ‌ట్టిగా రియాక్టైన‌ కోర్టు

పబ్లిక్ టాయ్ లెట్లలో కొన్ని చోట్ల ఆక‌తాయిలు ఏవేవో రాస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మహిళలకు సంబంధించిన నెంబర్లను.. వారి గురించి చెడుగా రాసి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం.

By Medi Samrat  Published on  16 Jun 2024 8:30 PM IST
టాయిలెట్ గోడపై మహిళ మొబైల్ నంబర్ రాసిన వ్య‌క్తి.. గ‌ట్టిగా రియాక్టైన‌ కోర్టు

పబ్లిక్ టాయ్ లెట్లలో కొన్ని చోట్ల ఆక‌తాయిలు ఏవేవో రాస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మహిళలకు సంబంధించిన నెంబర్లను.. వారి గురించి చెడుగా రాసి ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి పనులు చూసినప్పుడు ఇలాంటి వాళ్లు నిజంగా మనుషులేనా అని తప్పకుండా అనిపిస్తూ ఉంటుంది. కొందరు ఏకంగా మహిళల నెంబర్లను కూడా రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్లను ఏమి చేసినా పాపం లేదని అంటుంటారు. తాజాగా కర్ణాటకలో టాయ్ లెట్ గోడలపై మహిళ ఫోన్ నెంబర్ రాసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు.

ఒక మహిళ గోప్యతను భగ్నం కలిగించడం వివిధ నేరాలతో సమానమైనది, వ్యక్తిగత సమగ్రతకు భంగం కలిగించడం తీవ్రమైన మానసిక సంఘర్షణకు కారణమవుతుంది.. ఇది కొన్నిసార్లు శారీరక హాని కంటే ఎక్కువ బాధను కలిగిస్తుందని కర్ణాటక హై కోర్టు అభిప్రాయపడింది. చిత్రదుర్గ పట్టణానికి చెందిన అల్లా బక్షా పటేల్ అకా ఎబి పటేల్ (40) మహిళ గోప్యతకు భంగం కలిగించారని, తనపై దాఖలైన చార్జిషీట్‌ను ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులోని మెజెస్టిక్‌లోని KSRTC టెర్మినల్-Iలోని జెంట్స్ టాయిలెట్ గోడలపై ఆరోగ్య శాఖలోని ఒక మహిళా ఉద్యోగి మొబైల్ నంబర్‌ను వ్రాసి, ఆమె 'కాల్ గర్ల్' అని రాశాడు. దీంతో ఆమెకు అసంఖ్యాక కాల్స్ వెళ్లాయి. దీంతో ఆమె మనసు గాయపడింది.

ఛార్జిషీట్‌లో గోడలపై రాసిన వ్యక్తిని దోషిగా పేర్కొన్నారు. అందువల్ల అతను క్లీన్‌గా బయటకు రావడానికి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అదనపు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎన్ జగదీశ వాదించారు. "ఇలాంటి ఘటనలు స్త్రీని ఎంతగానో బాధపెడతాయి. కాబట్టి, న్యాయస్థానం ముందుకు వచ్చే ఇలాంటి కేసులను కఠినంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇలా రాయడం నిస్సందేహంగా స్త్రీ నిరాడంబరతను అవమానించడమే అవుతుంది." అని కోర్టు తెలిపింది. బహిరంగంగా ఒక మహిళపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయడం ద్వారా నిందితుడు తప్పించుకోలేడని కోర్టు అభిప్రాయపడింది.

Next Story