కరోనా తెచ్చిన తంటా.. భౌతిక దూరం పాటించిన భర్త.. వదిలేసిపోయిన భార్య
Man Maintains Social Distance from Wife. కరోనా వైరస్.. ఈ మహమ్మారి పేరు చెబితే చాలు చాలా మంది వణికిపోతున్నారు.
By Medi Samrat Published on 7 Dec 2020 11:16 AM ISTకరోనా వైరస్.. ఈ మహమ్మారి పేరు చెబితే చాలు చాలా మంది వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో భౌతిక దూరం పాటించడం, మాస్కులు వాడడం లాంటివి పాటిస్తున్నారు. ఇక కరోనా వైరస్ ఉండేమోనన్న అనుమానంతో ఓ కొత్త పెళ్లి కొడుకు చేసిన నిర్వాకం.. ప్రస్తుతం అతడికి కష్టాలు తెచ్చిపెట్టింది. భార్యకు కరోనా వైరస్ ఉందేమోనన్న అనుమానంతో అతడు.. ఆమెను దగ్గరికి రానివ్వడం లేదు. భార్య ఎంత దగ్గరవుదామన్నా గానీ..ఆ భర్త మాత్రం దూరంగానే ఉంటున్నాడు. దీంతో ఆ భార్యకు భర్త మీద అనుమానం వచ్చింది మగాడు కాదేమోనని..! కానీ పాపం ఆమెకేం తెలుసు..తన భర్తకు 'కరోనా భయం' పట్టుకుందని..!. ఇక చేసేది ఏమీ లేక.. భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది.
వివరాల్లో వెళితే.. నగరానికి చెందిన యువకుడికి ఈ ఏడాది జూన్ 29న పెళ్లైంది. అయితే.. కరోనా భయంతో అప్పటి నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని భార్యకు చెప్పలేదు. భార్య ఎంతగా భర్తకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాగానీ.. దూరం దూరం అంటున్నాడు. నెలలు గడుస్తున్నా అదేతీరు. దీంతో సదరు భార్యకు భర్తమీద అనుమానం వచ్చింది. మగాడు కాదేమోనని..దీంతో విసుగొచ్చి ఈ మొగుడు నాకు వద్దని పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత కోర్టు మెట్లు ఎక్కింది.
తన భర్త సంసారానికి పనికిరాడని అందుకే తనకు దూరంగా ఉంటున్నాడని, శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదని ఆరోపించింది. అందుకే, తనకు అతడి నుంచి భరణం ఇప్పించాలని కోరింది. దీంతో.. ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వాలని రంగంలోకి అధికారులు బావించారు.
దీంట్లో భాగంగా ఇరు కుటుంబాల వారు వచ్చాక..విషయాన్ని వివరించారు. దీనికి నీ సమాధానం ఏంటని భర్తను అడిగారు. దానికి భర్త కరోనా భయంతోనే భార్యకు దగ్గర కాలేకపోతున్నానని చెప్పటంతో అధికారులు షాక్ అయ్యారు. దీనికి సంబంధించి సదరు భర్త మాట్లాడుతూ.. వివాహం జరిగిన వెంటనే తన భార్య కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందనీ.. దీంతో ఆమెకు కూడా వైరస్ సోకి ఉంటుందనే భయంతోనే దూరంగా ఉంటున్నాననీ చెప్పాడు. తనలో ఎటువంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విన్న కౌన్సెలర్లు ఆశ్చర్యపోయారు.
అధికారులు.. ముందుగా భర్తకు పటుత్వ పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన సర్టిఫికెట్లను భార్య చేతికి ఇచ్చారు. అలాగే భార్యకు కరోనా పరీక్షలు చేయించి ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని నెగిటివ్ సర్టిఫికెట్లను భర్త చేతిలో పెట్టారు. అనంతరం ఇద్దరికి కౌన్సిలింగ్ చేసారు. ఇద్దరిని ఒక్కటి చేసి ఇంటికి పంపించి వేశారు.