పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఉప ఎన్నికలో దూసుకుపోతున్నారు. ఆమె బరిలో నిలిచిన భవానీపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి మమతా.. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 12,435 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. భవానీపూర్, జంగిపూర్, సంసెర్గంజ్ అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి.. నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగాలంటే ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ.. మమతా బెనర్జీ కోసం రాజీనామా చేశారు. దీంతో అక్కడి నుంచి పోటి చేశారు మమత. ఆమె విజయం దాదాపు ఖాయం కావడంతో మమతా ఇంటి ముందు టీఎంసీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.