పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భావిస్తోంది. ఇందుకోసం గత కొన్ని రోజుల నుంచే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం ప్రభుత్వం స్వస్థ్య సాథి హెల్త్ కార్డును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఇందుకోసం ఆమె సామాన్యులతో పాటు క్యూ లైన్‌లో నిలుచోవడం విశేషం.
కాళీఘాట్ లోని జోయ్ హింద్ భవన్‌లో కోల్‌కతా మున్సిపాలిటీ సంస్థ పంపిణి చేసిన హెల్త్ కార్డులను తీసుకోవడానికి ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి సామాన్యులతో పాటుగా క్యూలైన్లో నిలబడి.. తన వంతు వచ్చేవరకు వెయిట్ చేసి హెల్త్ కార్డులను తీసుకున్నారు. మమతా బెనర్జీతో పాటుగా రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి ఫర్హాద్ హకీమ్ కూడా క్యూలైన్లో నిలబడి హెల్త్ కార్డులు తీసుకున్నారు. దీని ద్వారా ప్రజలకు ఏడాదికి రూ.5లక్షల వరకు ఆరోగ్య భీమా అందనుంది.
దీనిపై భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు.