గంగూలీ అణచివేతకు గురవుతున్నాడు : మమతా బెనర్జీ ఆగ్రహం
Mamata Banerjee slams BCCI over Sourav Ganguly's exit. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీ అణచివేతకు గురవుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ గా పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి సౌరవ్ గంగూలీ తప్పించడం పట్ల మమతా బెనర్జీ సోమవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బెనర్జీ నాలుగు రోజుల పర్యటన కోసం ఉత్తర బెంగాల్‌కు వెళ్లారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆమె మాట్లాడారు.. "సౌరవ్ మనకు గర్వకారణం.. అతను క్రికెట్ బాగా ఆడాడు. అడ్మినిస్ట్రేటర్‌గా కూడా బాగా చేసాడు. ఆయనకు మూడేళ్లపాటు బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఆ పాత్రను చక్కగా అందించారు. పదవీకాలం పూర్తయిన తర్వాత, అతన్ని ఎందుకు తొలగించారో మాకు తెలియదు. అయితే అమిత్‌బాబు కుమారుడు (అమిత్ షా కుమారుడు, జై షా) మాత్రం అక్కడే ఉన్నాడు. అతను బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగడంలో మాకు ఎలాంటి సమస్య లేదు కానీ బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ను ఎందుకు తొలగించారో తెలుసుకోవాలనుకుంటున్నాం." అని అన్నారు. "ఏం తప్పు చేశాడని గంగూలీని తొక్కేస్తున్నారు? ఈ పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. గంగూలీ పరిస్థితి పట్ల దిగ్భ్రాంతికి కూడా గురయ్యాను. గంగూలీ బెంగాల్ కు మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం. ఎందుకు అతడిని ఇంత అమర్యాదకర రీతిలో సాగనంపుతున్నారు?" అంటూ మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బోర్డు పాలనా పగ్గాలు అందుకోనున్నారు. గంగూలీ వరుసగా రెండో పర్యాయం కూడా అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు మార్గం సుగమం చేసినా, బోర్డులోని ఇతర సభ్యుల నుంచి మద్దతు లేకపోవడంతో ఆ అవకాశం చేజారిందని వార్తలు వచ్చాయి. గంగూలీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ క్రికెట్ సంఘం కార్యకలాపాలు చూసుకోబోతున్నారని అంటున్నారు.