ప్రధాని మోదీ బలంపై దీదీ లేటెస్ట్ కామెంట్స్

Mamata Banerjee says Congress is the reason for BJP's TRP. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ

By M.S.R  Published on  31 Oct 2021 9:36 AM GMT
ప్రధాని మోదీ బలంపై దీదీ లేటెస్ట్ కామెంట్స్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ అయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ లేనంతగా దూసుకుపోతోంది. రాబోయే కొన్ని దశాబ్దాలలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఇటీవలే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ భారత దేశంలో బీజేపీ ప్రభావాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారని.. ఆయనతో ఉన్న ప్రధాన సమస్య అదే అని చెప్పుకొచ్చారు. భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మరికొన్ని దశాబ్దాల పాటు కేంద్రంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్లు నరేంద్రమోదీని కానీ బీజేపీని కానీ ప్రజలు వదులుకోవడం జరగదని.. బీజేపీ ప్రభావం ఇంకో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన అన్నారు. భారత రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలా ప్రభావితం చేసిందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి మోదీని ప్రజలు తిరస్కరిస్తారని కొందరు అంటున్నారని.. 30 శాతం ఓటు బ్యాంక్ సాధించిన ఏ పార్టీ అయినా ప్రజల నుంచి అంత తొందరగా పోదని అన్నారు.

ఇలాంటి సమయంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్‌ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్‌ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని అన్నారు.

బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్‌ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు.


Next Story