మమతా కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా

Mamata Banerjee Govt Decides to Give Telugu as State Official Language. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌

By Medi Samrat  Published on  23 Dec 2020 7:11 AM GMT
మమతా కీలక నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ అక్కడి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మ‌రోసారి అధికార ప‌గ్గాల‌ను చేప‌ట్టాల‌ని బావిస్తున్న మ‌మ‌తా ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార భాష హోదా ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తెలుగు భాషతో పాటు బెంగాల్‌లో నివస్తున్న తెలుగు వారిని భాషాపరమైన మైనారిటీలుగా గుర్తిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ తెలిపారు.

కాగా.. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఎక్కువ మంది తెలుగు వారు నివసిస్తున్నారు. అందుకే ఖరగ్‌పూర్‌ను మినీ ఆంధ్రాగా పిలుస్తారు. రైల్వే ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర నుంచి వేలాది తెలుగు వారు బెంగాల్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాదు స్థానిక రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఖరగ్‌పూర్‌ మునిసిపాలిటీలోని 35 వార్డుల్లో ఆరుగురు తెలుగువాళ్లే కౌన్సిలర్లుగా ఉన్నారు. అంతేకాదు పలు పార్టీల్లోనూ లు కీలక పదవులు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక చాన్నాళ్లుగా తెలుగుకు అధికార భాష హోదా క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తుండ‌గా.. మంగ‌ళ‌వారం కేబినేట్ భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో పదికిపైగా అధికార భాషలున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మినీ ఆంధ్రాగా పేరున్న ఖ‌ర‌గ్‌పూర్‌లోని తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించి ఓట్లు రాబ‌ట్టేందుకు మ‌మ‌తా స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


Next Story