న్యూఢిల్లీ: భారత్‌లోని మౌలికాంశాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని, ద్వేషంతో సమాజం విభజించబడిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదల, నిరుద్యోగంతో దేశ ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందరినీ కలుపుకొని పోవడం, వెంట తీసుకెళ్లడం కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు.
''భారతదేశం విజయవంతమైన, బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా, కొన్ని దశాబ్దాలలో ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాలలో సూపర్ పవర్‌గా అవతరించింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఐటి, సేవల రంగంలో ప్రపంచంలోని అగ్ర దేశాలలో అగ్రస్థానంలో ఉంది'' అని ఖర్గే అన్నారు. "ఇది స్వయంగా జరగలేదు. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు ఉన్న విశ్వాసం, అందరినీ వెంట తీసుకెళ్లాలనే మా సమ్మిళిత భావజాలం, అందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పించే రాజ్యాంగంపై మాకున్న పూర్తి విశ్వాసం వల్లనే ఇది జరిగింది'' అని ఆయన సమావేశంలో అన్నారు.
''భారతదేశపు ప్రాథమిక అంశాలు నిరంతరం దాడికి గురవుతున్నాయి. విద్వేషంతో సమాజం చీలిపోతోంది, ధరల పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'' అని ఆయన ఆరోపించారు. పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తల సమక్షంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను కూడా ఖర్గే ఆవిష్కరించారు.