ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ముగ్గురు మంత్రులు సస్పెండ్
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు.
By అంజి Published on 8 Jan 2024 1:45 AM GMTప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ముగ్గురు మంత్రులు సస్పెండ్
ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులను ఆదివారం సస్పెండ్ చేసినట్లు మాల్దీవుల అధికార ప్రతినిధి తెలిపారు. ఈ విషయాన్ని భారతదేశం ఈరోజు ద్వీప దేశంతో లేవనెత్తిన తర్వాత మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్‌లను వారి పదవుల నుండి సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం ఖండించింది. వారి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
భారత ప్రధాని ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యటించారు. సాహసాలు చేయాలనుకునే వారు తమ జాబితాలో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మాల్దీవుల మంత్రులు తమ అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని ట్వీట్లు చేశారు. తమ దేశం అందించే సర్వీసులను లక్షద్వీప్‌లో అందించలేరని, గదుల్లో దుర్వాసనే అతిపెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై భారతీయులు, పలువురు సెలబ్రెటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ముఖ్యంగా.. మరియం షియునా ప్రధాని లక్షద్వీప్ సందర్శించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రధాని మోదీని "విదూషకుడు", "తోలుబొమ్మ" అని పిలిచారు. ఈ వ్యాఖ్యలు పెనుదుమారం రేపడంతో ఆపై సదరు పోస్ట్‌ను డిలీట్ చేసింది. అంతకుముందు ప్రధాని ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృత దృష్టిని ఆకర్షించడంతో, అనేక మంది దీనిని మాల్దీవులతో పోల్చడంతో, ఎంపీ జాహిద్ రమీజ్‌తో సహా ఇతర మాల్దీవుల అధికారులు కూడా ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను ఎగతాళి చేశారు. మోదీపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను మాల్దీవుల ప్రభుత్వం తిరస్కరించింది, అవి మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించడం లేదని పేర్కొంది.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ కూడా ప్రధాని మోదీపై మరియం షియునా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను "భయంకరమైన భాష" అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు మాల్దీవుల అధికారులపై తీవ్ర విమర్శలకు దారితీశాయి, చాలా మంది వ్యక్తులు "మాల్దీవులను బహిష్కరించాలని" పిలుపునిచ్చారు. మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై వివాదం మధ్య, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ వంటి పలువురు ప్రముఖులు, కంగనా రనౌత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై చర్చలో పాల్గొన్నారు . కొందరు నేరుగా ప్రధాని మోదీ పర్యటనను, మాల్దీవుల స్పందనను ప్రస్తావించారు.