ప్రేమించిన అబ్బాయిని ఘనంగా పెళ్లి చేసుకున్న ట్రాన్స్ ఉమెన్.. ఎక్కడంటే?
Malayalam Actress Elizabeth Harini Marriage. ట్రాన్స్ జెండర్ హరిని చందన తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు.
By Medi Samrat Published on 22 Jan 2021 10:37 AM ISTమన సమాజంలో ట్రాన్స్ జెండర్ అంటే ఎంతో చులకనగా చూస్తారు. అలాంటిది వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా? వారంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ వారికి కూడా మనసు ఉంటుందని.. వారు మనలోఒకరిని చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. తాజాగా ఓ వ్యక్తి ట్రాన్స్ ఉమెన్ ను గాఢంగా ప్రేమించి.. తనను మూడుముళ్ల బంధంతో తన జీవితంలోకి ఆహ్వానించాడు. తను మరెవరో కాదు మలయాళ నటి, ట్రాన్స్‌వుమెన్ ఎలిజబెత్ హరిని చందన. తాజాగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోని వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొంతకాలంగా తనను ప్రేమిస్తున్న సునీష్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కేరళలోని ఎర్నాకులమ్ బీటీహెచ్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సెలబ్రిటీల మేకప్ ఆర్టిస్ట్, ట్రాన్స్‌జెండర్ రెంజు రెంజిమార్ వధువు తల్లి స్థానంలో నిలబడి పెళ్ళి తంతు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఎలిజిబెత్ ను పెళ్ళికూతురు చేసే కార్యక్రమం నుంచి అప్పగింతల వరకు తనతోనే ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ"తల్లిగా నా బాధ్యతలు పూర్తి చేశాను, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు.
హరిని చందన కుంబలంగికి చెందినది. 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలలో రన్నరప్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం హరిని చందన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.