క్వారీలో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి
Major dynamite blast in Shivamogga. కర్ణాటకలోని శివమొగ్గలో క్వారీలో గురువారం రాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది.ఎనిమిది మంది మృతి.
By Medi Samrat
కర్ణాటకలోని శివమొగ్గలో క్వారీలో గురువారం రాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది. అబ్బలగిరె గ్రామ సమీపంలో డైనమైట్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. క్వారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. పేలుడు శబ్దం దాదాపు 15-20 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ముందుజాగ్రత్తగా బాంబ్ స్క్వాడ్ బృందాలను రప్పించారు. గురువారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ భారీ పేలుడు చోటుచేసుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పేలుడు శబ్దం విని భయంతో స్థానికులు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఈ పేలుడుకు పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పలువురు స్థానికులు దెబ్బతిన్న తమ ఇళ్ల కిటికీల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్‌కు తరలించారు. పేలుడు ధాటికి శివమొగ్గ జిల్లాతో పాటు చిక్‌మంగళూరు జిల్లాలోనూ ప్రకంపనలు వచ్చాయి. భారీ శబ్దంతో ప్రకంపనలు రావడంతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.
ప్రధాని సంతాపం
శివమొగ్గ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని పీఎంఓ ట్వీట్ చేసింది.