రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చిన మంత్రి.. అవి అంత బాగోవు అంటూ స్పందించిన నటి.!
Maharashtra minister draws ire over comparing roads to Hema Malini's cheeks. మహారాష్ట్ర నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ మంత్రి గులాబ్రావ్ రఘునాథ్ పాటిల్.. తన జల్గావ్ రూరల్ నియోజకవర్గంలోని రోడ్లను నటి హేమ మాలిని బుగ్గలతో
By అంజి Published on 20 Dec 2021 3:16 PM ISTమహారాష్ట్ర నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ మంత్రి గులాబ్రావ్ రఘునాథ్ పాటిల్.. తన జల్గావ్ రూరల్ నియోజకవర్గంలోని రోడ్లను నటి హేమ మాలిని బుగ్గలతో పోల్చడం వివాదానికి దారితీసింది. అయితే రాష్ట్ర మహిళా కమిషన్ తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత అతను క్షమాపణలు చెప్పాడు. ఉత్తర మహారాష్ట్రలోని తన జిల్లాలోని బోద్వాడ్ నగర్ పంచాయతీ ఎన్నికల కోసం శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో శివసేన సీనియర్ నాయకుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాటిల్ తన ప్రసంగంలో భాగంగా.. తన నియోజకవర్గంలో రోడ్లు ఎంత బాగున్నాయో చూడాలని విపక్షాల కోరారు. 30 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారు నా నియోజకవర్గానికి వచ్చి రోడ్లు చూడాలని, హేమమాలిని బుగ్గల్లా రోడ్లు లేకపోతే.. నేను రాజీనామా చేస్తానని జల్గావ్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీ బీజేపీ నేత ఏక్‌నాథ్ ఖడ్సేను ఉద్దేశించి పాటిల్ అన్నారు. ఇంతలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా అన్నారు.. ఇంతకుముందు కూడా ఇలాంటి పోలిక జరిగింది. ఇది హేమమాలినికి గౌరవం. కాబట్టి దీనిని వ్యతిరేకంగా చూడవద్దు. ఇంతకుముందు లాలూ యాదవ్ కూడా ఇదే ఉదాహరణ చెప్పారు. మేము హేమ మాలిని గౌరవిస్తాము. అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నటి హేమమాలిని స్పందించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తెచ్చిన ఈ ట్రెండ్‌ను ఇప్పటికి పలువురు రాజకీయ నాయకులు అనుసరిస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు వినడానికి అంత బాగోవు అంటూ హేమమాలిని అన్నారు.
అంతకుముందు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించారు. "కమీషన్ మంత్రి చేసిన వ్యాఖ్యను పరిగణనలోకి తీసుకుంది. మంత్రి క్షమాపణలు చెప్పకపోతే, అతను చట్టపరమైన చర్యను ఎదుర్కోవలసి ఉంటుంది" అని చకంకర్ ఆదివారం ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. ఆమె హెచ్చరికను అనుసరించి పాటిల్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. ధూలేలో విలేకరులతో మాట్లాడిన మంత్రి, "నేను ఎవరినీ నొప్పించాలని అనలేదు. వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నేను ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను ఆరాధించే శివసేనకు చెందినవాడిని. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మహిళలను గౌరవించడం మాకు నేర్పించారు." అని అన్నారు.
గత నెలలో రాజస్థాన్ మంత్రి , కాంగ్రెస్ నాయకుడు రాజేంద్ర సింగ్ గూడా తన నియోజకవర్గంలోని రోడ్లను నటి కత్రినా కైఫ్ చెంపలతో పోల్చారు. 2019లో మధ్యప్రదేశ్ మాజీ మంత్రి పిసి శర్మ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు.