మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.

By అంజి  Published on  4 Feb 2025 7:25 AM IST
Maharashtra, Marathi mandatory, official communication, national news

మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

రాష్ట్ర ప్రణాళిక విభాగం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులందరూ మరాఠీలో మాత్రమే మాట్లాడాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. ఈ ఆదేశాన్ని పాటించని ఉద్యోగులు క్రమశిక్షణా చర్యలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ప్రణాళిక విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమ్యూనికేషన్లు, అధికారిక సంకేతాలు, డాక్యుమెంటేషన్‌కు వర్తిస్తుంది.

"భారతదేశం వెలుపల నుండి, మరాఠీ మాట్లాడని రాష్ట్రాల నుండి వచ్చే సందర్శకులు తప్ప, అందరు అధికారులు సందర్శకులతో సంభాషించేటప్పుడు మరాఠీ భాషను ఉపయోగించాలి" అని నోటిఫికేషన్ పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకులు కూడా మరాఠీలో సంభాషించవలసి ఉంటుంది, ఆ భాష మాట్లాడని వారు తప్ప అని పేర్కొంది. కంప్యూటర్ కీప్యాడ్‌లు, ప్రింటర్‌లపై రోమన్ అక్షరాలతో పాటు మరాఠీ దేవనాగరి లిపిలో టెక్స్ట్ ప్రదర్శించబడాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి.

ఈ నియమం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సెమీ-ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ-సహాయక సంస్థలకు వర్తిస్తుంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రకారం, ఈ విధానం అన్ని ప్రజా వ్యవహారాల్లో మరాఠీని ప్రోత్సహించడం, భాషను సంరక్షించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మరాఠీ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం.

Next Story