మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసు నుంచి వెనక్కి తగ్గినట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పరోక్ష సంకేతాలిచ్చారు.పదవుల కోసం మనస్తాపం చెందే వ్యక్తిని తాను కాదని బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. తనకు ప్రధానమంత్రి ఏమి ఇవ్వదలచుకుంటే దానిని సంతోషంగా అంగీకరిస్తానని చెప్పారు. 'మహాయుతి' కూటమికి ఘనవిజయం అదించిన మహారాష్ట్ర ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
'నేను ఎలాంటి మనస్తాపం చెందలేదు. కోపం కూడా లేదు. మహారాష్ట్ర అభివృద్ధికి తన నుంచి ఎలాంటి అవరోధాలు ఉండవని ప్రధానమంత్రికి తెలియజేశాను. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను'' అని షిండే తెలిపారు. మహాయుతి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రజలు విశ్వసించి ఘన విజయం అదించారని, ఇది ప్రజా విజయమని అన్నారు. తన రెండున్నరేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నానని, బాలాసాహెబ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లతో భారీ విజయం సాధించడంతో సీఎం ఎంపిక విషయంలో నాలుగు రోజులుగా ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఫడ్నవిస్‌కు సీఎం పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్ఠానం దాదాపు ఖాయం చేసింది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడు శ్రీకాంత్ షిండేకు ఇవ్వాలని షిండే కోరినట్టు్ ప్రచారం జరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 26న సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. డిసెంబర్ 2న 'మహాయుతి' కూటమి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరుునుంది.