దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ పీఠాన్ని ద‌క్కించుకున్న‌ బీజేపీ..!

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చారిత్రాత్మక ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి.

By -  Medi Samrat
Published on : 16 Jan 2026 8:15 PM IST

దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ పీఠాన్ని ద‌క్కించుకున్న‌ బీజేపీ..!

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చారిత్రాత్మక ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి. ముంబైలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న 'మాతోశ్రీ' ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ-షిండే కూటమి (మహాయుతి) భారీ మెజారిటీని సాధించడం ద్వారా థాకరే కుటుంబ 'చివరి కోట'ను ధ్వంసం చేసింది. దీంతో దేశంలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ పీఠంపై ఈసారి బీజేపీ మేయర్ కూర్చోనున్నారు. బీఎంసీతో పాటు మహారాష్ట్రలోని ఇతర 28 మునిసిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి.

మొత్తం 227 సీట్లు ఉన్న బీఎంసీలో మెజారిటీకి 114 సీట్లు అవసరం. తాజా లెక్కల ప్రకారం.. బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కలిసి 127 సీట్లు గెలుచుకున్నాయి. ఇందులో బీజేపీకి 97 సీట్లు, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 30 సీట్లు వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన (యుబిటి), ఆయన బంధువు రాజ్ థాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి 73 సీట్లు గెలుచుకున్నాయి. ఇందులో శివసేన (యూబీటీ)కి 64 సీట్లు, ఎంఎన్‌ఎస్‌కు తొమ్మిది సీట్లు వచ్చాయి. ఠాక్రే సోదరులు 20 ఏళ్ల తర్వాత కలిసి వచ్చినా బీఎంసీలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు.

గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి మహావికాస్‌ అఘాడీ నుంచి విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుంది. డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ అయిన వంచిత్ బహుజన్ అఘాడితో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ 15 సీట్లకు మించి దాట‌లేకపోయింది. BMC ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు స్పష్టంగా శివసేన (UBT) వైపు మొగ్గు చూపినప్పటికీ, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM ఆరు స్థానాలను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన X ఖాతాలో 2025-26 మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ మరోసారి చరిత్రను లిఖించిందని రాశారు.

Next Story