మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుద‌ల చేసిన బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితా విడుదలైంది.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 11:55 AM GMT
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుద‌ల చేసిన బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితా విడుదలైంది. బీజేపీ మూడో జాబితాలో 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అంతకుముందు పార్టీ రెండవ జాబితాలో 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. మొదటి జాబితాలో 99 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ మొత్తం 146 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

మూడవ జాబితాలో పార్టీ ఆశిష్ రంజిత్ దేశ్‌ముఖ్‌ను సావ్నర్ అసెంబ్లీ స్థానం నుండి అభ్యర్థిగా నిలిపింది. నాగ్‌పూర్ సెంట్రల్ స్థానం నుంచి ప్రవీణ్ ప్రభాకరరావు దట్కేకు టికెట్ దక్కింది. నాగ్‌పూర్ నార్త్ (ఎస్సీ) నుంచి మిలింద్ పాండురంగ్ మానేకు టికెట్ ఇచ్చారు. బోరివాలి నుంచి సంజయ్ ఉపాధ్యాయ్, లాతూర్ అసెంబ్లీ స్థానం నుంచి అర్చన శైలేష్ పాటిల్ చకుర్కర్‌లకు పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థుల పేర్లు ఉండటం గమనార్హం. వెర్సోవా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భారతీ లవేకర్‌, ఘట్‌కోపర్‌ ఈస్ట్‌ నుంచి పరాగ్‌ షాలను బీజేపీ మళ్లీ నామినేట్‌ చేసింది. బోరివలి స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని మార్చింది. ఎమ్మెల్యే సునీల్ రాణే టిక్కెట్‌ను రద్దు చేసి సంజయ్ ఉపాధ్యాయ్‌కు అవకాశం కల్పించారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు డా. సంతుక్ మటోత్రావ్ హంబర్డేను బీజేపీ అభ్యర్థిగా ప్ర‌క‌టించింది.

తాజాగా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 40 మంది నేతల పేర్లు ఉన్నాయి. ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికలు, నాందేడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయనున్నారు.

ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి మంగళవారం చివరి తేదీ. నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి.


Next Story