ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు

జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.

By Knakam Karthik
Published on : 27 Feb 2025 7:23 AM IST

National News, MahaKumbh Mela, Uttarpradesh, Prayagraj, Devotees

ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ జాతరకు భారీగా భక్తులు హాజరయ్యారు. చివరి రోజు మహా శివరాత్రి సందర్భంగా 1.44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే సీఎం యోగీ ఆదిత్యనాథ్ కుంభమేళా ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మహా కుంభమేళా ముగింపు సందర్భంగా అధికారులు భక్తులపై గులాబీ పూల వర్షం కురిపించారు.

మొత్తంగా జాతరకు మొత్తంగా 66 కోట్ల మందికి పైగా హాజరైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని హిందువుల జనాభాలో సగం మందికి సమానమైన ప్రజలు కుంభమేళాకు వచ్చారని పేర్కొంది. సగటున ప్రతి రోజూ 1.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు తెలిపింది. కుంభమేళా విజయవంతానికి సహకరించిన వారందరికీ యోగీ కృతజ్ఞతలు తెలిపారు.

కుంభమేళాలో చివరి రోజైన శివరాత్రి నాడు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటేత్తారు. చివరిరోజున కుంభమేళాలో భక్తులపై హెలికాఫ్టర్‌తో పూలవర్షం కురిపించటం హైలైట్ గా నిలిచింది. చివరి రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో యూపీ అధికార యంత్రంగా అప్రమత్తమై ఎక్కడిక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఎక్కడ అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.

Next Story