అర్థ‌రాత్రి నేపాల్‌లో భూకంపం.. వ‌ణికిన ఢిల్లీ ప్ర‌జ‌లు.. ఇళ్లు కూలి ఆరుగురు మృతి

Magnitude 6.3 earthquake strikes Nepal.పొరుగున ఉన్న నేపాల్‌లో భూకంపం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2022 2:15 AM GMT
అర్థ‌రాత్రి నేపాల్‌లో భూకంపం.. వ‌ణికిన ఢిల్లీ ప్ర‌జ‌లు.. ఇళ్లు కూలి ఆరుగురు మృతి

పొరుగున ఉన్న నేపాల్‌లో భూకంపం సంభ‌వించింది. దీని ప్ర‌భావంతో దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు స‌రిహ‌ద్దుల్లోని నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, లక్నో వంటి ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 సెక‌న్ల పాటు ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున రెండు గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించింది. ఏం జ‌రుగుతుందో తెలియ‌క భ‌యంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా న‌మోదైంద‌ని, భూమికి 10 కిలోమీట‌ర్ల లోతులో భూ కంప కేంద్రాన్ని గుర్తించిన‌ట్లు నేష‌న‌ల్‌ సిస్మోలజీ కేంద్రం తెలిపింది.

ఢిల్లీ, ప‌రిస‌ర ప్రాంతాల్లో సంభ‌వించిన భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు చెప్పారు.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు సార్లు..

నేపాల్ దేశంలో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు సార్లు భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయ‌ని నేపాల్ జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. మంగ‌ళ‌వారం రాత్రి 8.52 గంటల ప్రాంతంలో 4.9 తీవ్రతతో మొదటి భూకంపం వచ్చింది. బుధ‌వారం తెల్లవారుజామున 1.57 గంటలకు 6.3 తీవ్రతతో, 2.12 గంట‌ల‌కు 6.6 తీవ్ర‌త‌తో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో భూ కంపం సంభ‌వించింది. ఈ భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలిపోయింది. అందులో నివ‌సిస్తున్న ఆరుగురు మ‌ర‌ణించారు.

త‌ర‌చుగా భూ ప్ర‌కంప‌న‌లు..

ఇటీవల నేపాల్‌లో తరచుగా భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌విస్తున్నాయి. అక్టోబరు 19న కాఠ్మండులో 5.1 తీవ్రతతో, జూలై 31న 6.0 తీవ్రతతో భూమి కంపించింది. 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఈ భూ ప్ర‌కంప‌న‌ల కారణంగా 8,964 మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. మ‌రో 22 వేల మంది గాయ‌ప‌డ్డారు.

Next Story