ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించగా తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది.
ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైంది. భూకంప కేంద్రం బికనీర్‌కు పశ్చిమాన 516 కిమీ భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఈ ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఈ వారం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 6.6 తీవ్రతతో సంభవించింది. దీని కారణంగా ఆఫ్గానిస్థాన్‌లో నలుగురు, పాకిస్తాన్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.