భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టిన టమాటా.. చివరికేమైందంటే?

మధ్యప్రదేశ్‌లో టమాటాల వల్ల గొడవ జరిగింది. టమాటాలు వేసి వంట చేశాడని భర్తను విడిచి వెళ్లిపోయింది భార్య.

By అంజి  Published on  14 July 2023 2:25 AM GMT
Madhya Pradesh, tomatoes, curry, Viral news

భార్యభర్తల మధ్య చిచ్చు పెట్టిన టమాటా.. చివరికేమైందంటే?

టమాటా ధరలు భగ్గమంటున్నాయి. టమాటాలను కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బు ఆదా చేసేందుకు భారతీయులు తమ ఆహారంలో తక్కువ టమోటాలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ధరల్లో ఆకాశనంటుతున్న టమాటాలు.. గొడవలకు కూడా కారణంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో టమాటాల వల్ల గొడవ జరిగింది. టమాటాలు వేసి వంట చేశాడని భర్తను విడిచి వెళ్లిపోయింది భార్య. ఈ ఘటన శహడోల్‌ జిల్లా ధన్‌పురిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న సంజీవ్ కుమార్ వర్మ అనే వ్యక్తి.. అదే ప్రాంతంలో ఓ చిన్న దాబాను నడుపుతున్నాడు.

నాలుగు రోజుల కిందట సంజీవ్ కుమార్ వర్మ.. తన దాబాలో టమాటాలు వేసి కూర వండాడు. కిలో టమాటాల ధర 140 రూపాయలు పలుకుతున్న సమయంలో కూరలో టమాటా ఎందుకు వేశావంటూ భర్త సంజీవ్ కుమార్ వర్మతో భార్య ఆర్తి గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ తర్వాత భర్తను వదిలేసి ఆమె తన కుమార్తెతో కలిసి ఎటో వెళ్లిపోయింది. చివరకు ఏం చేయాలో తెలియక బర్మన్‌ పోలీసులను ఆశ్రయించాడు. సంజీవ్ కుమార్ వర్మను సముదాయించిన పోలీసులు అతని భార్యను వెనక్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

“ఉదయం మా కూతురితో బయలుదేరింది. మూడు రోజులుగా వారి కోసం వెతుకుతున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేశాను. దయచేసి నా భార్యను, కూతురిని తిరిగి తీసుకురావాలని కోరుతున్నాను' అని సంజీవ్ స్థానిక మీడియాకు తెలిపారు. గురువారం టమాట ధరలు కిలో రూ.150కి చేరడంతో సామాన్యులకు ఊరట లభించడం లేదు.

Next Story