12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు

By Knakam Karthik
Published on : 7 July 2025 8:19 AM IST

National News, Madhya Pradesh, Vidisha district, Police Constable,

12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్

మధ్యప్రదేశ్‌లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు. ఆ కానిస్టేబుల్ 2011లో మధ్యప్రదేశ్ పోలీస్ విభాగానికి సెలెక్ట్ అయ్యాడు. మొదట భోపాల్ పోలీస్ లైన్స్‌లో కానిస్టేబుల్‌గా పోస్టింగ్ ఇచ్చారు. చేరిన కొద్దికాలానికే, పోలీస్ శిక్షణ కోసం సాగర్ శిక్షణ కేంద్రానికి పంపారు. కానీ అతడు అక్కడ రిపోర్ట్ చేయలేదు. సైలెంట్‌గా విదిషలోని తన ఇంటికి వెళ్లిపోయాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకితా ఖతేర్కర్ తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడమో లేదా సెలవు కోరడమో చేయలేదు. తన సర్వీస్ రికార్డును భోపాల్ పోలీస్ లైన్స్ అధికారులకు స్పీడ్ పోస్ట్ ద్వారా వంపాడు.

అయితే, వాటిని ధ్రువీకరించుకోకుండానే అధికారులు ఆమోదించారు. అంతేకాదు శిక్షణ కేంద్రంలో అతను లేకపోవడాన్ని ఎవరూ గుర్తించలేదు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో కూడా ఎవరూ దానిని ప్రశ్నించలేదు. ఇటు పోలీస్ లైన్స్‌లో అటు సాగర్‌లో శిక్షణా కేంద్రంలో లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. రికార్డుల్లో మాత్రం పేరు ఉండటంతో విధులకు రాకున్నా 12 ఏళ్లుగా అతడి ఖాతాలో జీతం పడుతూనే ఉంది. 2023లో ఈ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీర్ఘకాలంలో ఒకేచోట పనిచేస్తున్న పోలీసులను బదిలీ చేయడం, 2011 బ్యాచ్ వారికి 'పే గ్రేడ్ మదింపునకు సంబంధించి జాబితా సిద్ధం చేస్తున్న సమయంలో ఈ కానిస్టేబుల్ వ్యవహారం వెలుగు చూసింది. చివరకు కానిస్టేబుల్‌కు నోటీసులు పంపి వివరణ కోరారు. చివరికి ఇప్పటివరకు తీసుకున్న జీతంలో కొంత మొత్తాన్ని (రూ1.5 లక్షలు) ప్రభుత్వానికి అప్పగించాడు. మిగతాది కూడా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

Next Story