రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే సిలిండర్.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  17 Oct 2023 5:00 PM IST
madhya pradesh, congress, manifesto,  elections,

రూ.2లక్షల రుణమాఫీ, రూ.500కే సిలిండర్.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్‌లోనే వేర్వేరు తేదీల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల మేనిఫెస్టో వారి గెలుపునకు ప్రధాన పోషిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం 106 పేజీలతో ఎన్నికల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రూ.25లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పింది.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ ప్రజలపై హామీల వర్షం కురిపించింది. మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించేలా రూపొందించింది. తాము అధికారంలోకి రాగానే ప్రతిఒక్కరికి రూ.25లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. అలాగే ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఐపీఎల్ జట్టు ఏర్పాటు సహా 59 హామీలను ఇచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందేలా మేనిఫెస్టోను రూపొందించామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌ చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ కేవలం రూ.500కే అందిస్తామని చెప్పింది. అంతేకాదు.. రూ.2లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. రూ.10లక్షల మేర ప్రమాద బీమా కూడా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని.. పాఠశాల విద్యను పూర్తిగా ఉచితంగా అందేలా చూస్తామని చెప్పింది. ఇక నిరుద్యోగ యువతకు వారివారి అర్హత ఆధారంగా నెలకు రూ.1500 నుంచి రూ.3వేల చొప్పున రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్‌ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్‌ 17న పోలింగ్ జరగనుంది.

Next Story