కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ కార్యకర్త 'PayCM' అనే టీ-షర్ట్ ను వేసుకున్నాడు. అయితే కొందరు వ్యక్తులు అతడు ఆ టీషర్టు విప్పేలా చేశారు. అతనిపై కేసు నమోదు చేయబడింది. భారత్ జోడో యాత్ర సాగుతున్న మొదటి BJP పాలిత రాష్ట్రం కర్ణాటక. కాంగ్రెస్ కార్యకర్త అక్షయ్ కుమార్ ఈరోజు భారత్ జోడో యాత్రకు 'PayCM' అని రాసి ఉన్న పోస్టర్‌తో కూడిన టీ-షర్టును ధరించాడు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, అతని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలా విమర్శలు చేస్తున్నారు. కుమార్ క్యూఆర్ కోడ్‌తో కూడిన PayCM పోస్టర్‌తో తెల్లటి జెండాను పట్టుకుని కనిపించాడు. అతడిని చూసిన కొందరు బలవంతంగా అతడి టీ షర్టును విప్పించేసారు.
'పేసిఎం' టీ షర్ట్ ధరించిన మా కార్యకర్తపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. అతడి టీషర్ట్ తీసేసి దాడి చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ ఘటనకు పాల్పడింది పోలీసులేనని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. 'వీరు పోలీసులా లేక గూండాలా? దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి' అని రాష్ట్ర కాంగ్రెస్ ట్విటర్‌లో ఘటన వీడియోను పోస్టు చేసింది. వీడియోలో, ఒక పోలీసు వ్యక్తి వెనుక నుండి కొట్టడం గమనించవచ్చు.