ఓట్ల కోసం మాటలే.. శ్రీకృష్ణుడితో రోజూ మాట్లాడుతున్నానన్న అఖిలేష్
Lord Krishna came in my dreams to say SP will win. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రచారంలో నాయకులు చెబుతున్న మాటలు
By Medi Samrat Published on 4 Jan 2022 7:12 PM IST
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రచారంలో నాయకులు చెబుతున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఎందుకంటే సమాజ్‌వాదిపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన ప్రచారానికి శ్రీకృష్ణుడిని కూడా వాడుకున్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వాన్నిని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని చెప్పారు. అదే విధంగా, పొరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసి వారు కూడా గ్రామాల పేర్లు మారుస్తున్నారని తెలిపారు.
"బాబా [యోగి ఆదిత్యనాథ్] విఫలమయ్యారు. ఆయన్ను ఎవరూ రక్షించలేరు.ప్రతి రోజూ రాత్రి శ్రీకృష్ణుడు నా కలలో కనిపిస్తాడు మరియు యూపీలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడు," అన్నారాయన. అఖిలేష్ యాదవ్ 2019లో అజంగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఎస్పీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. శాంతిభద్రతలు, రామమందిరం, పీయూష్ జైన్ కేసు, మాఫియా రాజ్ తదితర సమస్యలపై ఇరు పార్టీలు పరస్పరం మాటల దాడులు చేసుకుంటున్నాయి. ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గృహవినియోగ దారులకు 300ల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. 2012 నుంచి 2017 వరకు ఎస్పీ తమ హయంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తుచేశారు. బీజేపీ వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు.