విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం బిల్డింగ్స్ నిర్మాణ నమూనాలను మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాట్లు, నిర్మాణాలు ముందడుగు పడుతుండడంతో నారా లోకేష్ బిల్డింగ్ నమూనాలను పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా విశాఖ రైల్వే జోన్ ఎదురుచూపు నెరవేరుతున్నందుకు మంత్రి నారా లోకేష్ ఆనందంగా ఉందన్నారు.
ఇప్పటికే రూ.149 కోట్లతో 12 అంతస్తుల విశాఖ రైల్వే జోన్ జీఎం కార్యాలయం నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. వచ్చేనెల 27 వరకు టెండర్లు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ వస్తున్న నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ కు ప్రాధాన్యత పెరిగింది. బహిరంగ సభలో విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ శ్రేణులు చెబుతున్నాయి.