కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ.. మహిళలకు ఏడాదికి రూ.లక్ష
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. న్యాయ్ యాత్ర పేరుతో 48 పేజీల మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
By అంజి Published on 5 April 2024 12:32 PM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. 30 లక్షల ఉద్యోగాల భర్తీ.. మహిళలకు ఏడాదికి రూ.లక్ష
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 'న్యాయ్ పత్ర-2024' పేరుతో ఏఐసీసీ కార్యాలయంలో రిలీజ్ చేశారు. న్యాయ్ యాత్ర పేరుతో 48 పేజీల మేనిఫెస్టోను మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో ప్రకటించారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలు ఈ మేనిఫెస్టోలో ఉంటాయి. మహాలక్ష్మీ పథకం కింద పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం.. ఏటా పంటకు కనీస మద్దతు ధర ఇస్తామని పేర్కొంది. దాదాపు 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపింది. అంతేకాకుండా రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.25 లక్షల క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్‌ను దేశ వ్యాప్తంగా తీసుకొస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంది.
కాగా ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం వివరించారు. గత పదేళ్లుగా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని, అన్నిరంగాల్లో విధ్వంసం జరిగిందని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా కుల గణన చేపడతామన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేత, రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత, అగ్నివీర్ స్కీం రద్దు, ఇంధన ధరల తగ్గింపు చేస్తామన్నారు. సంపద సృష్టించాలంటే వృద్ధి రేటు పెరగాలని, మోదీ పాలనలో అలా జరగలేదని అన్నారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదన్నారు. యూపీఏ హయాంలో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటే.. ఎన్డీఏ హయాంలో గత పదేళ్లలో 5.8 శాతంగానే ఉందన్నారు.