ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుతపులి క‌ల‌క‌లం.. వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌మ‌ని ఆదేశాలు

మంగళవారం కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని ఆదేశించింది.

By Medi Samrat  Published on  31 Dec 2024 3:51 PM IST
ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుతపులి క‌ల‌క‌లం.. వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌మ‌ని ఆదేశాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

మంగళవారం కర్ణాటకలోని మైసూరు క్యాంపస్‌లో చిరుతపులి సంచరిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయమని ఆదేశించింది. అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చిరుతపులి కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులు క్యాంపస్‌లో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు.

తొలుత అండర్‌గ్రౌండ్ పార్కింగ్ జోన్‌లో చిరుతపులిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది, దాని కదలికలను కూడా సీసీటీవీ కెమెరాల్లో బంధించారు. ఉదయం నుంచి క్యాంపస్‌లోకి సిబ్బందిని అనుమతించడం లేదని మానవ వనరుల విభాగం ధృవీకరించింది.

మంగళవారం తెల్లవారుజామున చిరుతపులి కనిపించినట్లు సమాచారం. చిరుతపులిని ప‌ట్టుకునేందుకు శిక్షణ పొందిన నిపుణులతో సహా 50 మంది అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఆపరేషన్ కోసం నియమించారు. చిరుతపులిని పట్టుకునేందుకు క్యాంపస్‌కు వలలు, బోనులను కూడా తీసుకొచ్చారు. చిరుతపులిని గుర్తించడానికి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు.

దాదాపు 15,000 మంది సిబ్బంది మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో పని చేస్తున్నారు. ఇది ఇన్ఫోసిస్ కంపెనీకి భారతదేశంలో అతిపెద్ద శిక్షణా కేంద్రం. క్యాంపస్ కనీసం 10,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్యాంప‌స్ 370 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇన్ఫోసిస్ ఈ క్యాంపస్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసింది.

కూంబింగ్ ఆపరేషన్ కొన‌సాగుతుండ‌టంతో క్యాంపస్‌లోని గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో నివసిస్తున్న సుమారు 4,000 మంది ట్రైనీలను ఇంటి వ‌ద్దే ఉండమని అధికారులు చూచించారు. శిక్షణా సెషన్‌లు, సెమినార్‌లు, ఇతర కార్యకలాపాలు ఆన్‌లైన్ మోడ్‌లో చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు చేసుకున్నారు.

ఇన్ఫోసిస్ అధికారిక సమాచారంలో.. “ప్రియమైన ఇన్ఫోసియన్, ఈ రోజు మైసూరు DC క్యాంపస్‌లో ఒక అడవి జంతువు కనిపించింది. క్యాంపస్ భద్రతను నిర్ధారించడానికి టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయంతో ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. ఇదిలావుంటే.. క్యాంప‌స్ ఆవరణలో చిరుతపులి కనిపించడం ఇదే మొదటిసారి కాదు.. 2011లో కూడా ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ క్యాంపస్ చిరుతపులికి ఆవాసంగా పిలువబడే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో ఉంది.

Next Story