చిరుతను చంపేశామంటూ మృతదేహాన్ని చూపిస్తే కానీ నమ్మలేదు!!
మహారాష్ట్రలో చిరుత ప్రజలను భయపెట్టింది
By - Knakam Karthik |
చిరుతను చంపేశామంటూ మృతదేహాన్ని చూపిస్తే కానీ నమ్మలేదు!!
మహారాష్ట్రలో చిరుత ప్రజలను భయపెట్టింది. నెల రోజులుగా పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ప్రజలపై దాడులకు తెగబడుతున్న చిరుతపులిని షార్ప్‌షూటర్లు చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు. పింపార్ఖేడ్ గ్రామం సమీపంలోని కాలిగుర్తుల ద్వారా చిరుత పులిని గుర్తించారు. మొదట చిరుతను ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నించారు. కానీ ఊహించని పరిణామాల కారణంగా చిరుతను చంపేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
గత నెలలో, శిరూర్ తహసీల్‌లోని మౌజే పింపార్ఖేడ్ ప్రాంతంలో చిరుతపులి దాడుల్లో ఇద్దరు మైనర్లు, ఒక వృద్ధుడు మరణించారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని జున్నార్, శిరూర్, అంబేగావ్, ఖేడ్ తాలూకాలలో నిరసనలు చెలరేగాయి. ఆదివారం పింపార్ఖేడ్ గ్రామం సమీపంలో చిరుతపులి దాడిలో 13 ఏళ్ల బాలుడు మరణించిన తరువాత, ఆగ్రహించిన స్థానికులు అటవీ శాఖ వాహనాన్ని తగలబెట్టారు. అటవీ అధికారులు ఆ జంతువును పట్టుకోవాలని, లేదా చంపేయాలని డిమాండ్ చేశారు.
ఆ మృతదేహాన్ని గ్రామస్తులకు చూపించి, తరువాత పోస్టుమార్టం కోసం మానిక్‌డో రెస్క్యూ సెంటర్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు. మంగళవారం, బుధవారం నాడు పింపార్ఖేడ్, జాంబుట్ గ్రామాల సమీపంలో దాదాపు 8 కి.మీ. పరిధిలో రెండు చిరుతపులులను పట్టుకున్నట్లు అధికారి తెలిపారు. గత నెల జాంబుట్‌లో చిరుతపులి దాడిలో ఒకరు మరణించారు. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం, పూణే జిల్లాలోని జున్నార్ అటవీ విభాగంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 6 నుండి 7 చిరుతపులులు ఉన్నాయి.