సుప్రీంకోర్టులో సంచలనం..సీజేఐపై చెప్పు విసిరే ప్రయత్నం

సుప్రీంకోర్టు లో సోమవారం ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది.

By -  Knakam Karthik
Published on : 6 Oct 2025 3:54 PM IST

National News, Delhi, Suprem Court, CJI BR Gavai

సుప్రీంకోర్టులో సంచలనం..సీజేఐపై చెప్పు విసిరే ప్రయత్నం

ఢిల్లీ: సుప్రీంకోర్టు లో సోమవారం ఒక సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. విచారణ జరుగుతున్న సమయంలో ఒక న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వైపు చెప్పు విసరడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తిని వెంటనే భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. బయటకు తీసుకెళ్తుండగా, ఆయన “సనాతన ధర్మ అవమానాన్ని భారత్ భరించదు” అని అరిచారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జవారి ఆలయంలో విష్ణు విగ్రహ పునరుద్ధరణ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్ చేసిన “దేవుడినే అడుగు, ఆయనే ఏమైనా చేస్తాడు” అనే వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈరోజు జరిగిన ఘటన ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జరిగినదని భావిస్తున్నారు.

ఈ ఘటన తర్వాత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ప్రశాంతంగా స్పందిస్తూ,..ఇలాంటి విషయాలతో మనం దారి తప్పకూడదు. ఇవి నన్ను ప్రభావితం చేయవు. విచారణను కొనసాగించండి,” అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ పాండే మాట్లాడుతూ.. “ఆ న్యాయవాది 2011 నుంచి బార్ అసోసియేషన్ సభ్యుడు. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోంది. ఇది తీవ్రమైన నిందనీయ చర్య. కఠిన చర్య తీసుకోవాలి,” అని అన్నారు.

కాగా గత నెల సెప్టెంబరులో జవారి ఆలయ విష్ణు విగ్రహ పిటిషన్‌ పై విచారణలో గవాయ్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అనంతరం ఆయన తన వ్యాఖ్యలు “తప్పుగా అర్థం చేసుకున్నారని” వివరణ ఇచ్చి, “నేను అన్ని మతాలను గౌరవిస్తాను” అని స్పష్టం చేశారు.

Next Story