న్యాయమూర్తులను 'గూండాలు' అని పిలిచిన న్యాయ‌వాదికి జైలు శిక్ష‌

అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం న్యాయవాదిని కోర్టు ధిక్కార కేసులో దోషిగా నిర్ధారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.

By Medi Samrat
Published on : 11 April 2025 2:53 PM IST

న్యాయమూర్తులను గూండాలు అని పిలిచిన న్యాయ‌వాదికి జైలు శిక్ష‌

అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం న్యాయవాదిని కోర్టు ధిక్కార కేసులో దోషిగా నిర్ధారించి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. 2000 జరిమానా కూడా విధించిన కోర్టు.. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా జమ చేయకపోతే మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయవాది అశోక్ పాండే నాలుగు వారాల్లోగా లక్నోలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయి జైలుకు వెళ్లి శిక్షను అనుభవించాలని కోర్టు పేర్కొంది.

2021లో న్యాయవాది అశోక్ పాండేపై నమోదైన క్రిమినల్ ధిక్కార కేసులో తీర్పును వెలువరిస్తూ.. జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ బీఆర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం సుమోటోగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా వచ్చే మూడేళ్లపాటు ఎందుకు నిషేధించకూడదని కోరుతూ పాండేకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తన తరఫు వాదనలు వినిపించేందుకు పాండేకు కోర్టు మే 1 వరకు గడువు ఇచ్చింది.

వాస్తవానికి 2021 ఆగస్టు 18న ఈ విషయంలో పాండేపై కోర్టు స్వయంసిద్ధంగా ధిక్కార కేసు నమోదు చేసింది. అభియోగాలను రూపొందించే సమయంలో.. పాడే లాయర్ దుస్తులు ధరించకుండా పోడియం వద్దకు వచ్చారని, ఆయ‌న‌ చొక్కా బటన్లు కూడా తెరిచి ఉన్నాయని కోర్టు తెలిపింది. అలాగే అత‌డు అమర్యాదగా ప్రవర్తించాడు. అత‌డిని కోర్టు నుండి బయటకు పంపమని కోర‌గా.. న్యాయమూర్తులను గూండాలు అని పిలిచాడు. పాండే చర్యలు న్యాయస్థానం గౌరవాన్ని దిగజార్చాయని.. ఈ విష‌య‌మై అత‌డు పశ్చాత్తాపపడలేదని కోర్టు పేర్కొంది.

విచారణ సందర్భంగా, న్యాయస్థానం పాండేకు సమాధానం దాఖలు చేయడానికి పదేపదే అవకాశం ఇచ్చింది.. అయితే అతను ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. పాండేపై పలు ధిక్కార కేసులు నమోదయ్యాయని, అవి కొనసాగుతున్నాయని కోర్టు పేర్కొంది.

2017లో కూడా కోర్టు ధిక్కార కేసులో పాండేను దోషిగా నిర్ధారించిన తర్వాత.. అతడు అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్‌లోకి ప్రవేశించకుండా రెండేళ్లపాటు నిషేధించబడ్డాడు. ఇంత జరిగినా.. పాండే ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు.

Next Story