కుంభమేళాను ముగించేశారు.. రద్దు ప్రకటనపై బైరాగి సాధువుల ఆగ్రహం

Haridwar Kumbhamela stopped. కుంభమేళాను ముగించాలని సాధువుల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. పలువురికి ఆదర్శంగా నిలవాలని మోదీ కోరారు.

By Medi Samrat  Published on  18 April 2021 4:04 PM IST
Kumbamela

హరిద్వార్ లోని మహా కుంభమేళాపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే..! లక్షల్లో ప్రజలు వస్తూ ఉన్నారని.. షాహీ స్నానాలు చేస్తూ.. ఒక్కరు కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదని చాలా రిపోర్టులు వచ్చాయి. దీంతో ఈ కుంభమేళాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. కుంభమేళాను ముగించాలని సాధువుల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. పలువురికి ఆదర్శంగా నిలవాలని మోదీ కోరారు. మోదీ కోరినట్లుగానే కుంభమేళాను ముగించారు. ఈ నెల 1న కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హరిద్వార్ కు చేరుకున్న లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే, వేలాది మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కుంభమేళాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ముగిస్తున్నామని, మిగతా రోజుల్లో భక్తులు లేకుండా నామమాత్రంగా వేడుక జరుగుతుందని స్వామి అవధేశానంద గిరి వెల్లడించారు. భక్తులను కొవిడ్ నుంచి కాపాడటమే తమ లక్ష్యమని.. దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. కుంభమేళా ముగిసిందని ఆయన ప్రకటించారు. అందరు దేవుళ్లకూ జరగాల్సిన పూజలు, నిమజ్జనాలు జరుగుతాయని అవధేశానంద గిరి చెప్పుకొచ్చారు. ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేసిన ఆయన, మిగతా సాధువులు, ఆలయాల ధర్మకర్తలు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే లక్షలాది మంది పవిత్ర స్నానాలను ఆచరించారని, మిగతా షాహీ స్నాన్ వేడుకలు భక్తులు లేకుండా జరుగుతాయని అన్నారు. ఉత్సవాలను ఆపేందుకు తొలుత నిరాకరించిన ప్రధాన సాధువులు, ఆపై మనసు మార్చుకున్నారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ సంఖ్య ఏప్రిల్‌ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్‌మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్‌ అఖాడాలు ప్రకటించారు. కుంభ్‌ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్‌ కొనసాగుతుందని ప్రకటించారు. కుంభ్‌మేళా ఏ ఒక్క సంస్థ లేదా అఖాడాలకు చెందినది కాదని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిరంజని, ఆనంద్‌ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్‌ అఖాడాలు డిమాండ్‌ చేశాయి. కుంభ్‌మేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే ఉందని వారు ప్రకటించారు.


Next Story