లాలూకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ కుమార్తె

Lalu Prasad Yadav's daughter Rohini to donate kidney to her father. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే

By M.S.R  Published on  10 Nov 2022 5:45 PM IST
లాలూకు కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధ‌మైన‌ కుమార్తె

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..! కిడ్నీ కూడా ఫెయిల్ అయిందని ఇది వరకే వైద్యులు తెలిపారు. తాజాగా సింగపూర్ లో ఉంటున్న ఆయన కుమార్తె రోహిణి ఆచార్య ఒక కిడ్నీని తన తండ్రికి ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ అక్టోబర్ లో సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేసుకోవాలని వారు సూచించారు. దీంతో తన తండ్రికి ఒక మూత్రపిండాన్ని ఇస్తానని కుమార్తె రోహిణి వైద్యులకు తెలిపినట్టు తెలిసింది. దీనికి తొలుత లాలూ ప్రసాద్ యాదవ్ అంగీకరించలేదు. కానీ, కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ తీసుకుని మార్పిడి చేయడం వల్ల అధిక సక్సెస్ రేటు ఉంటుందంటూ, రోహిణి తన తండ్రిని ఒప్పించినట్టు తెలిసింది.

నవంబర్ 20-24 మధ్య లాలూ మరోసారి సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆ సమయంలో అక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయనున్నట్టు సమాచారం. లాలూ గత కొన్నేళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. సింగపూర్‌లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి, తన తండ్రి కిడ్నీ వ్యాధుల గురించి చాలా ఆందోళన చెందింది. కిడ్నీ మార్పిడికి వైద్యుల బృందం లాలూకు సింగపూర్‌ను సూచించింది. రోహిణి సింగపూర్‌లో ఉన్నప్పటికీ, బీహార్‌లో రాజకీయాలను నిశితంగా గమనిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను చెబుతూ వస్తుంటుంది.


Next Story