గాయాలు లేకపోతే.. లైంగిక దాడి జరగలేదని కాదు: హైకోర్టు
బాధితురాలి ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలే లేనంత మాత్రాన.. ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
By అంజి Published on 16 Aug 2023 7:30 AM GMTగాయాలు లేకపోతే.. లైంగిక దాడి జరగలేదని కాదు: హైకోర్టు
లైంగిక దాడి కేసుకు సంబంధించిన విచారణలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి ప్రైవేట్ పార్ట్‌లపై గాయాలే లేనంత మాత్రాన.. ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక దాడి కేసులో పిటిషనర్‌కు దిగువ స్థాయి కోర్టు విధించిన పన్నెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ కొట్టి పారేసింది. ఢిల్లీలో ఓ చిన్నారిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. అతడికి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాల్ చేశాడు. పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన కోర్టు.. తాజా వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ 2017లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ కేసులో విచారణ పూర్తిచేసిన కింది కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది. శిక్షపడిన వ్యక్తి కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై ఎలాంటి గాయాలు లేవని వైద్య పరీక్షల్లో తేలిందని, చేయని నేరానికి తనకు శిక్షపడిందని, కావునా తనకు కింది కోర్టు విధించిన శిక్షను ఉపసంహరించాలని చేయాలని పిటిషనర్ కోరాడు. కానీ, ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం అతని పిటిషన్ కొట్టేసింది. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని భావించలేమని వ్యాఖ్యానించింది. గాయాలు లేకపోవడమే మైనర్‌పై లైంగిక వేధింపులు జరగలేదని చెప్పడానికి కారణం కాదని పేర్కొంది.
ట్రయల్ కోర్టు తీర్పులో ఎలాంటి బలహీనత లేదని పేర్కొంటూ చిన్నారిని కిడ్నాప్ చేయడం, లైంగికంగా వేధించడం వంటి నేరాలకు ఆ వ్యక్తికి విధించిన శిక్షను జస్టిస్ అమిత్ బన్సల్ సమర్థించారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై ఎలాంటి గాయాలు లేవన్న వ్యక్తి వాదనకు సంబంధించి హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. లైంగిక నేరాల కేసుల్లో ప్రైవేట్ భాగాలపై గాయం చొప్పించే లోతు వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని ట్రయల్ కోర్టు సరిగ్గా గమనించిందని, ప్రతి సందర్భంలోనూ గాయం అవుతుందన్న గ్యారెంటీ లేదని చెప్పింది.
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం నిందితులపై చట్టబద్ధమైన అనుమానాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం, మైనర్‌పై లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినందుకు ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసినప్పుడు, నిందితుడిని దోషిగా భావించాలి. ప్రస్తుత కేసులో నిందితుడు, ప్రధాన సాక్ష్యం ద్వారా లేదా ప్రాసిక్యూషన్ యొక్క సాక్ష్యాన్ని తిరస్కరించడం ద్వారా పైన పేర్కొన్న ఊహను విజయవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యాడని హైకోర్టు పేర్కొంది.