కుంభమేళాపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Kumbh Mela returnees will distribute Covid as 'prasad', says Mumbai Mayor Kishori Pednekar. హరిద్వార్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో

By Medi Samrat  Published on  17 April 2021 9:35 AM GMT
కుంభమేళాపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు

హరిద్వార్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులకు కరోనా సోకుతున్న సంగతి తెలిసిందే..! కరోనా హాట్ స్పాట్ గా కుంభమేళా మారుతోందని పలువురు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. కుంభ‌మేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ నేప‌థ్యంలో దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కుంభ‌మేళాను కుదించేలా చూడాల‌ని మోదీ కోరారు. ప్రస్తుత మహమ్మారి కఠిన పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా అంటే సింబాలిక్ గా జరపాలంటూ సాధువులను కోరారు. కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో అనేక మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ జునా అఖాడా హెడ్‌ స్వామి అవధేశానంద్‌ గిరితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

అయితే కుంభమేళాపై ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే భక్తులంతా కరోనాను 'ప్రసాదం'లా పంచిపెడతారని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ కుంభమేళా భక్తులను క్వారంటైన్ చేయాలని ఆమె సూచించారు. ఎవరైనా కుంభమేళా నుంచి వారి వారి రాష్ట్రాలు, సొంతూర్లకు వెళతారో.. వారంతా కరోనాను ప్రసాదంలాగా పంచిపెడతారు. ముంబైకి తిరిగి వచ్చిన కుంభమేళా భక్తులందరినీ వారి ఖర్చులతోనే క్వారంటైన్ లో పెడతామని ఆమె అన్నారు. చిన్న చిన్న ఆంక్షలు పెడితే సరిపోవని, కరోనాను కట్టడి చేయాలంటే ముంబైలో పూర్తి లాక్ డౌన్ పెట్టాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయన్నారు. 95 శాతం ముంబై జనాలు కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని, పాటించని మిగతా ఆ ఐదు శాతం మందితోనే కరోనా విజృంభిస్తోందని చెప్పారు. కిషోరి పెడ్నేకర్ వ్యాఖ్యలపై ప్రస్తుతానికి దుమారం రేగుతోంది.


Next Story