మథురలోని కృష్ణ జన్మభూమిని ధ్వంసం చేసిన‌ ఔరంగజేబు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మథురలో కృష్ణ జన్మభూమి ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని సాక్ష్యాలు బయటకు వచ్చింది.

By Medi Samrat  Published on  5 Feb 2024 1:30 PM GMT
మథురలోని కృష్ణ జన్మభూమిని ధ్వంసం చేసిన‌ ఔరంగజేబు

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మథురలో కృష్ణ జన్మభూమి ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని సాక్ష్యాలు బయటకు వచ్చింది. 2024, ఫిబ్రవరి 3న ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) 1920 సంవత్సరంలోని చారిత్రక రికార్డులను బయట పెట్టింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మథురలోని కృష్ణ జన్మభూమిని కూల్చివేయడం గురించి చారిత్రక రికార్డులు చెబుతున్నాయని సంచలన నివేదికను అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి నివాసి అజయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్‌కు సమాచార హక్కు (RTI) ద్వారా ప్రశ్నించారు. అతను 1670 CEలో షాహీ ఈద్గాను నిర్మించడానికి కేశదేవ దేవాలయాన్ని ధ్వంసం చేసిన మధురలోని కృష్ణ జన్మభూమి గురించి నిర్దిష్ట సమాచారాన్ని కోరాడు. నవంబర్ 1920లో నిర్వహించిన సర్వే వివరాలను అందించాలని సింగ్ ASIని కోరారు.

ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత ఔరంగజేబు నిర్మించిన మసీదు స్థలంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించినట్లు ఆగ్రా పురావస్తు శాఖ ఆర్టీఐలో పేర్కొంది. భారత పురావస్తు శాఖ బ్రిటీష్ హయాంలో 1920లో ప్రచురితమైన గెజిట్ ఆధారంగా వివరాలను వెల్లడించింది. మసీదు స్థానంలో అంతకుముందు కత్రా కేశవదేవ్ ఆలయం ఉందని, దానిని తొలగించి మసీదును నిర్మించారని పేర్కొంది. ఈ సమాచారం చాలా కీలకమైనదని న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్ చెబుతున్నారు. కీలకమైన సాక్ష్యాన్ని హైకోర్టు ముందు, ఆపై సుప్రీం కోర్టు ముందు సమర్పిస్తానని తెలియజేశారు. మహేంద్ర ప్రతాప్ సింగ్ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి న్యాస్ అధ్యక్షుడుగా ఉన్నారు. బ్రిటిష్ హయాంలో పనిచేసిన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్ అండ్ రోడ్ సెక్షన్ ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రదేశాలలో ప్రచురించిన గెజిట్‌లో నమోదు చేసిన 39 స్మారక చిహ్నాల జాబితా ఉందని ఆయన తెలిపారు. ఈ జాబితాలో కత్రా కేశవ్ దేవ్ భూమి వద్ద ఉన్న శ్రీ కృష్ణ భూమి 37వ స్థానంలో పేర్కొని ఉందని అన్నారు. ఇంతకు ముందు కత్రా గుట్టపై కేశవ్ దేవ్ ఆలయం ఉండేదని అందులో ఉందని, దానిని కూల్చివేసి, మసీదును కట్టారని వివరించారు.

Next Story