కాంగ్రెస్‌కు షాక్ : రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి

Koushik Reddy Resigns For Congress. ఈరోజు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాల్ రికార్డింగ్

By Medi Samrat  Published on  12 July 2021 11:41 AM GMT
కాంగ్రెస్‌కు షాక్ : రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి

ఈరోజు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాల్ రికార్డింగ్ లీక్ అయిన సంగతి తెలిసిందే..! కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాష‌ణ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఓ కార్యకర్తతో ఫోన్‌లో ఆయ‌న మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీచేయ‌డానికి ఆ టికెట్‌ తనకే ఖ‌రారైన‌ట్లు తెలిపారు. ఎన్నిక నేప‌థ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్క‌రికీ 2 లేక 3 వేల రూపాయ‌ల చొప్పున‌ ఇస్తానని అన్నారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీసీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇలాంటి చర్యలను సమర్థించబోమని ఆయన అన్నారు. కౌశిక్ రెడ్డికి ఇప్పటికే తమ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. అవసరమైతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని అన్నారు.

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసు అందుకున్న కొద్ది గంటల్లోనే పార్టీకి కౌశిక్‌ రెడ్డి రాజీనామా చేశారు. సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను కౌశిక్ రెడ్డి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు కౌశిక్ రెడ్డి లేఖలో తెలిపారు. ఈ మేర‌కు కౌశిక్ రెడ్డి రాజీనామా లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదిలావుంటే.. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన ఈటెల ప్ర‌చారం చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం అభ్య‌ర్ధి ఎంపిక‌ను జాప్యం చేస్తుంద‌ని.. రేవంత్ రెడ్డి బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. మాణిక్కం ఠాగూర్ కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ ప‌ద‌వి కొనుక్కున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు.


Next Story
Share it