కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసుపై దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదటిసారిగా స్పందిస్తూ.. తన బాధను వ్యక్తం చేశారు. పీటీఐతో మాట్లాడిన ఆమె.. ఈ ఘటన తనను 'దిగ్భ్రాంతికి గురి చేసిందని' అన్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేసిన రాష్ట్రపతి.. ఇక చాలు.. నాగరిక సమాజం తన కుమార్తెలు, సోదరీమణులపై ఇలాంటి క్రూరత్వాన్ని సహించదని అన్నారు. కోల్‌కతాలో ఒక వైపు విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు నేరస్థులు ఇతర ప్రదేశాలలో తిరుగుతున్నారని అన్నారు. ఇక చాలు.. ఏదో ఒకటి చేయాలన్నారు.
సమాజం నిజాయితీ, నిష్పాక్షికతతో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలు తమను తాము కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలి. తరచుగా అసహ్యకరమైన మనస్తత్వం ఉన్నవ్యక్తులు స్త్రీలను తమకంటే తక్కువవారిగా భావిస్తారు. వారు స్త్రీలను తక్కువ శక్తిమంతులు, తక్కువ సామర్థ్యం, తక్కువ తెలివితేటలు గలవారిగా చూస్తారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని అత్యాచార ఘటనలను సమాజం మరిచిపోయిందన్నారు. మరచిపోయే ఈ అలవాటు అసహ్యకరమైనది. రాష్ట్రపతి దీనిని 'సామూహిక మతిమరుపు'గా అభివర్ణించారు. చరిత్రను ఎదుర్కొనేందుకు భయపడే సమాజం మాత్రమే విషయాలను మరచిపోవడాన్ని ఆశ్రయిస్తుందన్నారు. ఇప్పుడు భారతదేశం చరిత్రను పూర్తిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వైకల్యాన్ని మనం కలిసి ఎదుర్కోవాలి.. తద్వారా అది మొగ్గగానే ఉన్నప్పుడే నివారించవచ్చని అన్నారు. .
ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌ని హత్య చేసి లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిల్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని ర్యాలీలు నిర్వహించారు.