ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ ఇదే.. బెంగళూరు మహిళలో గుర్తింపు.!
గోపీచంద్ ఒక్కడున్నాడు సినిమాలో రేర్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నాం. అదే బాంబే బ్లడ్ గ్రూప్. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అభిమానులను చాలా ఆకర్షించింది.
By Medi Samrat
గోపీచంద్ ఒక్కడున్నాడు సినిమాలో రేర్ బ్లడ్ గ్రూప్ గురించి విన్నాం. అదే బాంబే బ్లడ్ గ్రూప్. ఈ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా అభిమానులను చాలా ఆకర్షించింది. అంతకన్నా రేర్ గ్రూప్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రత్యేకమైన CRIB యాంటిజెన్ బ్లడ్ గ్రూప్ కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల మహిళలో కనుగొనబడింది. ఈ బ్లడ్ గ్రూప్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. వాస్తవానికి కార్డియాక్ అరెస్ట్ తర్వాత మహిళను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమె రక్త వర్గాన్ని తనిఖీ చేయడానికి ఆమె నమూనాను ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్ అసిస్టెంట్ విచారణలో బయటపడిన రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గుండె శస్త్రచికిత్స కోసం చేరిన మహిళ రక్త సమూహం ORH+, ఇది సాధారణం. కానీ ఓ పాజిటివ్ బ్లడ్ యూనిట్లు ఏవీ ఆమె రక్తంతో సరిపోలలేదు. దీని తరువాత రక్త నమూనాను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు పరీక్ష కోసం రోటరీ బెంగళూరు TTK బ్లడ్ సెంటర్‌కు పంపారు. అక్కడ రక్త పరీక్షలు జరిగాయి. అయితే మహిళ రక్తం అన్ని పరీక్షల నమూనాలతో సరిపోలలేదు. కుటుంబంలోని దాదాపు 20 మంది వ్యక్తుల నమూనాలను కూడా తీసుకున్నారు. అయితే ఎవరి రక్తం మహిళ రక్త నమూనాతో సరిపోలలేదు.
రోటరీ బెంగళూరు టీటీకే బ్లడ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ అంకిత్ మాథుర్ మాట్లాడుతూ.. రక్తమార్పిడి లేకుండా మహిళకు ఆపరేషన్ విజయవంతంగా చేశామన్నారు. మహిళ, ఆమె కుటుంబ సభ్యుల రక్త నమూనాలను బ్రిటన్‌లోని బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ లేబొరేటరీకి పంపారు. 10 నెలల పరిశోధన తర్వాత.. అది కొత్త బ్లడ్ గ్రూప్ యాంటిజెన్ కనుగొన్నారు. దీనికి CRIB అని పేరు పెట్టారు. జూన్ 2025లో ఇటలీలో జరిగిన ISBT సమావేశంలో ఈ పరిశోధన సమర్పించబడింది.
CRIB పేరులో CR అంటే 'క్రోమర్' మరియు IB అంటే 'ఇండియా', బెంగళూరు. రోటరీ బెంగళూరు TTK బ్లడ్ సెంటర్ అరుదైన రక్తదాతల రిజిస్ట్రీని ప్రారంభించిందని డాక్టర్ మాథుర్ తెలిపారు. తాము ఇప్పటికే చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ రోగులకు సహాయం చేసినట్లు వెల్లడించారు.