భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. క్వాడ్ సదస్సు, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి మోదీ వెళుతున్నట్టుగా విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ ప్రమాణం చేశాక ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్ సదస్సులో చర్చించనున్నారు. సెప్టెంబర్ 24న వాషింగ్టన్‌లో జరిగే క్వాడ్ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. 23న వైట్‌హౌస్‌లో మోదీ అధ్యక్షుడు బైడెన్‌తో ముఖాముఖి చర్చించే అవకాశాలున్నాయి.
మోదీకి అమెరికాలో నిద్రలేని రాత్రులు మిగుల్చుతామని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) అనే ఖలిస్థానీ ఉగ్రసంస్థ బెదిరిస్తోంది. క్వాడ్ నేతల సదస్సు జరిగే రోజున శ్వేత సౌధం ముందు ఆందోళనలను నిర్వహిస్తామని ఎస్ఎఫ్ జే ప్రకటించింది. రైతులపై హింసకు వ్యతిరేకంగానే ఈ నిరసన అని తెలిపింది. ఆ వ్యాఖ్యలపై ప్రధాని భద్రతా విభాగం స్పందించింది. కేవలం ప్రచారం కోసమే ఎస్ఎఫ్ జే వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసిందని పేర్కొంది. అందులో ఎక్కువ మంది పాక్ కు చెందిన ఐఎస్ ఐ ఏజెంట్లే ఉన్నారని తెలిపింది. వారు నిరసన చేసే అవకాశాలున్నాయని వెల్లడించింది.