దట్టమైన అడవుల్లో దారి తప్పి.. కేవలం అర లీటరు నీళ్ల సీసాతో..!
కేరళకు చెందిన 36 ఏళ్ల ట్రెక్కర్ జి.ఎస్. శరణ్య, కర్ణాటకలోని కొడగు జిల్లా దట్టమైన అడవుల్లో నాలుగు రోజుల పాటు ఒంటరిగా గడిపారు.
By - Medi Samrat |
కేరళకు చెందిన 36 ఏళ్ల ట్రెక్కర్ జి.ఎస్. శరణ్య, కర్ణాటకలోని కొడగు జిల్లా దట్టమైన అడవుల్లో నాలుగు రోజుల పాటు ఒంటరిగా గడిపారు. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ లేకపోయినా.. కేవలం అర లీటరు నీళ్ల సీసాతో ఆమె ఆ కష్టాన్ని నిర్భయంగా తట్టుకున్నారు. స్థానికుల సహాయంతో ఆదివారం ఆమెను సురక్షితంగా రక్షించారు.
శరణ్య కోజికోడ్‌కు చెందిన ఒక ఐటీ నిపుణురాలు. ఏప్రిల్ 2న, ఆమె తన ట్రెకింగ్ బృందంతో కలిసి కొడగులోని ఎత్తైన శిఖరమైన తడియాండమోల్‌కు వెళ్ళింది. కిందికి దిగుతున్నప్పుడు, ఆమె బృందం నుండి విడిపోయి దారి తప్పిపోయింది. ఆ తర్వాత ఆమె నాలుగు రోజుల పాటు దట్టమైన అడవిలో ఒంటరిగా గడపవలసి వచ్చింది. రక్షించబడిన తర్వాత తాను కిందకు దిగుతున్నప్పుడు ఎలాగో దారి తప్పిపోయానని, తన బృందాన్ని మళ్లీ కనుగొనలేకపోయానని శరణ్య వివరించింది. ఆమె ఫోన్ బ్యాటరీ అయిపోవడం, నెట్‌వర్క్ లేకపోవడంతో బయటి ప్రపంచంతో ఆమెకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
మొదటి రోజు కాళ్ల నొప్పితో కదల్లేకపోయిన శరణ్య, రెండో రోజు ఒక రాతిపైనే ఉండిపోయింది. పైన తిరుగుతున్న డ్రోన్ కెమెరాకు తను కనిపిస్తానని ఆశపడింది. కానీ, మూడో రోజు కురిసిన భారీ వర్షం ఆమె ఆశలను అడియాశలు చేసింది. గడ్డకట్టే చలి, తడిసిన బట్టలతో ఆ రాత్రంతా వణికిపోయింది. ఆహారం లేదు.. కేవలం అటవీ ప్రవాహాల్లో దొరికిన నీటినే తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకుంది. "నాకు ఎందుకో భయం వేయలేదు" అని ఆమె ధీమాగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో ఆమె నాలుగు రాత్రులు గడపడం ఒక అద్భుతమనే చెప్పాలి.
శరణ్య ఆచూకీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలతో ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. అటవీ శాఖ, పోలీసులు, థర్మల్ డ్రోన్లు ఇలా 40 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం, స్థానిక కుడియ గిరిజన తెగకు చెందిన రెస్క్యూ బృందం ఆమె అరుపులు విని గుర్తించింది. దట్టమైన పొదల మధ్య నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రక్షించిన వారితో నవ్వుతూ నడుచుకుంటూ వస్తున్న శరణ్య వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.