కేరళ రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య కార్యకర్తలు మీడియా మాట్లాడాలంటే ఇక నుండి ప్రభుత్వం అనుమతి తీసుకోనున్నారు. వైద్యాధికారులు మీడియాతో మాట్లాడటాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య కార్యకర్తలు మీడియాతో బహిరంగంగా మాట్లాడాలంటే డిపార్ట్‌మెంట్ నుండి ముందస్తు అనుమతి అవసరమని పేర్కొంటూ కేరళ ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసింది. మీడియాతో సమాచారాన్ని పంచుకోవడంలో వైద్యాధికారులు, ఆరోగ్య కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని కేరళ హెల్త్ డైరెక్టర్ వీకే రాజు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.
"అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండా సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించబడదు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించాల్సిన అవసరం ఉంటే, వారు వాస్తవాలను ధృవీకరించాలి, ఆరోగ్య శాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలి" అని నోటీసులో పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ రోజువారీ వ్యవహారం, ఇతర విషయాలకు సంబంధించి.. వార్తా వేదికలపై ప్రచురితమైన కొంత సమాచారం అధికారికంగా లేదని నోటీసులో ఎత్తి చూపారు. అటువంటి వార్తలను ప్రచురించడం వలన డిపార్ట్‌మెంట్ పని గురించి "ప్రజలను తప్పుదారి పట్టించడం" "వ్యాధి వ్యాప్తి గురించి కలకలం" ఏర్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.