ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలల మూసివేత
Kejriwal announces closure of primary schools from saturday in Delhi.ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది.
By తోట వంశీ కుమార్ Published on 4 Nov 2022 7:13 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. శీతాకాలానికి తోడు సమీప రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలోని రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్య తీవ్రత పెరిగింది. ఢిల్లీ ప్రజలను గాలి కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని శనివారం నుంచి ప్రైమరీ పాఠశాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. గాలి నాణ్యత మెరుగుపడేంత వరకు ఈ మూసివేత కొనసాగుతుందని చెప్పారు. ఐదు, అంతకంటే పై తరగతుల విద్యార్థుల అవుట్‌డోర్ గేమ్స్ ను కూడా నిలివేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఐక్యూ) 472 వద్ద ఉంది. ఇది చాలా ప్రమాదకర స్థితిని సూచిస్తోంది.
प्रदूषण पर पंजाब के मुख्यमंत्री के साथ एक संयुक्त प्रेस वार्ता। https://t.co/0bLYYvVBul
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 4, 2022
పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారత సమస్య అని అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో తీవ్ర వాయుకాలుష్యం నమోదు అవుతోంది. "గాలి నాణ్యత తగ్గడానికి ఒక్క ఢిల్లీనో, పంజాబ్ ప్రభుత్వమో కారణం అని కాదు. నిందలు వేయడానికి, రాజకీయాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదు. పంజాబ్‌లోనూ మా ప్రభుత్వమే ఉంది. అక్కడ పంట వ్యర్థాల దహనాలకు పూర్తి బాధ్యత మాదే. పంజాబ్‌లో మేం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఈ సమయంలో అనేక సమస్యలపై దృష్టి సారించాం. పంట వ్యర్థాల సమస్యపై కూడా ఆలోచనలు చేస్తున్నాం. ఓ సంవత్సరం సమయం ఇవ్వండి. వచ్చే ఏడాది నవంబర్ నాటికి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుంటాం "అని కేజ్రీవాల్ అన్నారు.